70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి
- విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి
- ప్రత్యేక కల్లూరు నియోజకవర్గం ఏర్పాటు డీలిమిటేషన్ పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
- సత్తుపల్లి ప్రాంతంలో మూడు పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం చెన్నూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మొదటి విడతలో 70 నియోజకవర్గాల్లో రూ. 200 కోట్లతో ఈ సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా, నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కల్లూరును ప్రత్యేక నియోజకవర్గంగా మార్చడం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన సమీకరణలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. సత్తుపల్లి ప్రాంతంలో మూడు పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని, పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
ఆర్థిక సవాళ్లు ఎదురైనా రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 బోనస్ వంటి పథకాలకు, విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ శ్రీజతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.